October 18, 2026

జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా’సంజీవని’ : ముఖ్యమంత్రి చంద్రబాబు

WhatsApp Image 2026-08-26 at 6.52.46 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పౌరులందరికీ అత్యాధునిక, నాణ్యమైన వైద్యారోగ్య సేవలను ఉచితంగా, వేగవంతంగా అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ‘సంజీవని ప్రాజెక్టు’ను వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం (ఆగస్టు 26న) నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసిన సంజీవని అద్భుత ఫలితాలను ఇచ్చిందని, ఇదే విజయవంతమైన నమూనాను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్నారు. ఏపీ వైద్య రంగాన్ని దేశంలోనే ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి కుటుంబం తమ సంపాదనలో అధిక మొత్తం విద్య, వైద్యానికే ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే సంజీవని వంటి పథకాల ద్వారా ప్రజలకు వైద్య ఖర్చులను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు.
ఈ వినూత్న ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న ప్రముఖ టాటా ఎండీ (Tata MD) సంస్థ వైద్యారోగ్య రంగంలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు రావలసిందిగా సీఎం చంద్రబాబు నిర్దేశించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అధికారులు 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా బేస్‌లైన్ అధ్యయనం నిర్వహించడం, సమగ్ర డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంతో పాటు వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. జాతీయ, రాష్ట్ర పోర్టళ్లతో డేటాను అనుసంధానించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. మొత్తం 28 జిల్లాల్లోని క్షేత్రస్థాయి వైద్య సిబ్బందికి దీనిపై పూర్తి అవగాహనతో పాటు శిక్షణ కల్పిస్తామని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.